Friday, June 28, 2013

పతంజలిభాష్యం

మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి అధికారులూ, నాయకులూ ఉన్నారు. అయినా సమస్యలు సమస్యల్లాగే ఉన్నాయి. ఎందుకంటే సదరు నాయకులూ, అధికారులూ చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు. ఇలాంటప్పుడే మనకి ఆగ్రహం కలుగుతుంది. ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఇది అందరిలోనూ ఉన్నా ఏ కొద్దిమందో మాత్రమే దానిని ప్రకటించ గలుగుతారు.

ఎందుకంటే ధర్మాగ్రహాన్ని ప్రకటించడానికి కావలసినవి నాలుగు.. సమస్యల పట్ల స్పందించే హృదయం, స్పందించగల తెగువ, స్పందించడానికి తగినంత భాష, ఆ స్పందనని ప్రచురించగల పత్రిక. ఈ నాలుగూ ఉన్నవాళ్ళు అతికొద్దిమంది ఉంటారు. ఆ అతి కొద్దిమందిలో ఒకరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. తెలుగు సాహితీ రంగంలో కే.యెన్.వై. పతంజలిగా ప్రసిద్ధుడైన ఈ అలమండ రాసబిడ్డ వ్యవస్థపై తన ధర్మాగ్రహాన్ని ప్రకటించి భాష్యకారుడైనాడు. ఆయన ఆగ్రహానికి అక్షర రూపమే 160 పేజీల 'పతంజలిభాష్యం.'

'నేను ఫలానా రచయిత రచనలు చదివాను' అని చెప్పుకోడాన్ని కొందరి విషయంలో మనం గర్వంగా ఫీలవుతాం. నాకు సంబంధించి ఆ కొందరు రచయితల జాబితాలో పతంజలిది తిరుగులేని స్థానం. తను సృష్టించిన ఒక్క 'వీరబొబ్బిలి' పాత్ర చాలు, పతంజలి రచనలు ఎందుకు చదవాలో చెప్పడానికి. "నేను ఫ్యూడల్ ని" అని రొమ్ము విరుచుకుని చెప్పిన పతంజలి ఎప్పుడూ పేదల పక్షమే. నిజానికి ఆయనది వెన్నలాంటి మనసు. లేకపోతే దగాపడ్డ వాళ్ళ గుండె ఘోష వినగలిగేవాడే కాదు.. వాళ్ళ పక్షాన గొంతు విప్పేవాడే కాదు.

"బాధ్యతారహిత మానవ సమాజం మీద అక్షర శర సంధానం" ఇది పతంజలి భాష్యానికి ప్రచురణ కర్తలు ఇచ్చిన ఉప శీర్షిక. నిజమే.. మన సమాజం బాధ్యతారహితం కాకపోయినట్టైతే రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేది కాదు.. బాల కార్మికులు ఉండే వాళ్ళు కాదు. రైతుల బలవన్మరణాలు ఉండేవి కాదు. లాకప్ మరణాలూ, పోలీసు ఎన్కౌంటర్లూ కూడా ఉండి ఉండేవి కాదు. ప్రజల ముఖాల్లో బతుకు భయం, చావుకళ మచ్చుకైనా కనిపించేవి కాదు. ప్రజలంతా నవ్వుతూ, తుళ్ళుతూ నిశ్చింతగా ఉండేవాళ్ళు.

మనది బాధ్యతా రహిత సమాజం కాబట్టే ఇక్కడ ఎన్నికలు కేవలం ఐదేళ్లకోసారి జరిగే తంతు. ఎన్నికలైపోయిన తరువాత దేశం 'దగాపడిన ఆడకూతురి' లాగ ఉంటుంది. పాలకులకి 'హింసా మార్గమే చక్కని రాజమార్గం' అవుతోంది. 'కత్తిని బతిమాల కూడదు.. కత్తికి విజ్ఞప్తి చేయకూడదు.. కత్తికి ధర్మాలు బోధించకూడదు..' అని చెబుతూనే 'కత్తి ప్రాణ రక్షణ కోసం కాక రక్తదాహంతో వీధిలోకి వచ్చేస్తే దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఆయుధాగారంలోకి నెట్టేయాలి.. ఆ బాధ్యత మొత్తం ప్రజలందరిది..' అంటారు పతంజలి.

నిజానికి 'పతంజలిభాష్యం' పాతికేళ్ళ చరిత్రపై రన్నింగ్ కామెంటరీ. రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక, రాజకీయ సమస్యలు, దేశ రాజకీయాలు, విదేశీ విధానాలు, అనేక సందర్భాల్లో అమెరికా కర్ర పెత్తనం లాంటి జరిగిపోయిన విషయాలన్నీ మనకి గుర్తు చేస్తుంది. కుర్చీల్లో కూర్చున్న మనుషులు మాత్రమే మారారు, వాళ్ళు అనుసరించే విధానాలు మారలేదు అని మనం మరింత స్పష్టంగా అర్ధం చేసుకోడానికి దోహద పడుతుంది. నీళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టుగా, ఎలాంటి వ్యక్తైనా కుర్చీలో కూర్చునేసరికి అందుకు తగ్గట్టు మారిపోతాడు అని అర్ధమవుతుంది.

ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రజలపై వేసిన రకరకాల పన్నులు, ఉద్యోగుల పట్ల ఆయన వైఖరి, చంద్రబాబు చాణక్యం, 'అక్షరాల' సాయంతో అధికారంలోకి వచ్చిన వైనం, అదే అక్షరాలని వాడుకుని అధికారులతో ఆడుకున్న చమత్కారం మాత్రమే కాదు, కేంద్రంలో పీవీ 'చాణక్యం', వాజపేయి 'రాజనీతి,' సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ జార్జి, ఫెర్నాండెజ్ అనే ఇద్దరు నాయకులుగా విడిపోయారన్న నిష్టుర సత్యం, కాశ్మీర్ సమస్యపై అమెరికా అనవసర జోక్యం, మన నాయకుల పొంతనలేని సమాధానాలు.... ఎన్నో, ఎన్నెన్నో అంశాలు.

గత పాతికేళ్ళ కాలం లో వివిధ పత్రికల్లో పతంజలి రాసిన 56 వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. పతంజలిని గురించి ఆర్.కే. విశ్వేశ్వర రావు (ప్రచురణ కర్త), రావి శాస్త్రి, 'మో' రాసిన వ్యాసాల తో పాటు, పతంజలి స్వయంగా రాసిన 'నేపధ్యం' ఇంకా రమణజీవి చేసిన పతంజలి 'చివరి ఇంటర్వ్యూ' లనూ చదవొచ్చు. ఈ తెలుగు పుస్తకం సైజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వెల ఎక్కువే అనిపిస్తుంది. మన చుట్టూ ఏం జరిగిందో, జరుగుతోందో తెలుసుకోడానికి తప్పక చదవాల్సిన పుస్తకం. (పర్స్పెక్టివ్స్ ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు) 

No comments:

Post a Comment