Monday, June 24, 2013

సద్గురు సుభాషితాలు


హిమాలయ సానువులు.ఎంతో దూరప్రయాణం తరువాత ఆ యువకుడు అక్కడ దిగాడు.అతని రెండు బట్టల మూటలను మోసుకొంటూ,కొండ ఎక్కడానికి,అక్కడున్న గాడిదాల్ని బాడుగకు మాట్లాడుకున్నాడు.
      
      "ఎక్కడికి వెళ్ళాలి సాహెబ్?" గాడిదను నడిపేవాడు అడిగాడు.
      "ఏదైనా ఒక మంచి ఆశ్రమానికి పద"
      "ఎన్నాళ్లు వుంటారు?" అని అడిగాడు
      
      "రోజులా? ఇక నా జీవితం ఇక్కడే గడపాలనుకున్నాను. నా భార్యా పిల్లలు,అమ్మ,నాన్న,వ్యాపారం అన్నీవదిలిపెట్టి వచ్చేశాను. ఇదుగో నా మెడలోవున్న ఈ బంగారు గొలుసు కూడా నీకిచ్చేసి వెళ్లిపోతాను"
గాడిదను తోలేవాడు ఆశ్చర్యపోయాడు. "ఇంత చిన్న వయసులో మీకు ఇదెలా సాధ్యం అయింది?"
ఆ యువకుడి ముఖంలో కాస్త గర్వం తొణీకింది.

"మా ఊరు వచ్చిన ఒక గురువుగారు చెప్పినటువంటి విషయం నన్ను లోతుగా ఆలోచింపచేసింది.కదలించింది.
ఆశలే దుఃఖాలకు మూలకారణమట.అందుకే అన్ని ఆశల్నీ త్యజించి వచ్చేశాను"

"అన్నీ వదిలేసి మరి ఈ మూటాల్లో ఏం తెచ్చారు సాహెబ్?" అని అడిగాడతను.

"ఇక్కడ చలి ఎక్కువని చెప్పారు. కావాలంటే దగ్గర్లో అంగళ్లు కూడా వుండవు కదా!
ఈ మూటల్లో నాకు కావలసిన కంబళ్లు తెచ్చుకున్నాను"

కంబలి వద్దని వదిలేయకలేకపోయినా, ఆశను త్యజించానని చెప్పుకుంటున్న ఆ యువకుడిలాగే ఎందఱో ఆశను గెలిచామనీ, త్యజించామనీ (చెప్పుకొని తిరుగుతుంటారు) చెప్పుకుంటున్నారు.

          ఆశలేనిదే ఈ ప్రపంచం లేదు. ఆశలేనిదే ఈ శరీరం ఉండదు. ప్రాణం నిలవదు. దేనినీ ఆశపడకూడదని ఈ ప్రపంచం మీకు చెప్పలేదు.ఆశను వదిలేస్తే అంతా సరిగా ఉంటుంది అనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
ఆశను త్యజించాలని నిశ్చయీంచుకున్నాను అంటూ మీ మనసు మిమ్మల్ని మభ్యపెడుతుంది. సన్యాసం గురించి ప్రసంగిస్తుంది.

         మనసు చాలా తంత్రాలు నేర్చినది. ఏదేదో చెప్పి మిమల్ని నమ్మించి ఏమ్మార్చగలదు. ఆ చాకచక్యం దానికుంది. అయితే మరి శరీరం మాటెంటి? గాలి చొరబడకుండా మీ నోరు, ముక్కు మూసుకుని వేడుక చూడండి.ఒక్క నిమిషం, లేదా రెండు నిముషాలు శరీరం సహిస్తుంది. తర్వాత, బతకాలానే కోరిక మీలో పుట్టి బలం పుంజుకొని మీ చేతిని బలవంతంగా నెట్టివేస్తుంది.

         పోగొట్టుకున్న క్షణాల్ని కలిపి ఆక్సిజన్ను త్వరత్వరగా పిల్చుకొంటుంది. ఆశలు లేవంటూ మీ మనసు చెప్పే తాత్వికమైన కబుర్లు మీ శరీరం దగ్గర ఏమాత్రం  పనిచేయవు. ఎందుకంటారు, దానికి అబద్దం చెప్పి ఏమార్చడం చేతకాదు. శరీరం మొత్తం గురించిన మాటలెందుకు? అందులోని ప్రతి 'జీవకణం' ఆశతోనే జీవిస్తుంది.

         అతిధిగానైనాసరే ఒక రోగక్రిమి అందులోకి ప్రవేశించనీయండి. వెంటనే ప్రతి ఒక 'జీవకణం' ఆయుధాల్ని సిద్దం చేసుకొని పోరు మొదలుపెడుతాయి.

         ఎందుకలా?  ప్రపంచం బతకాలనే కోరిక దానికి నేర్పింది. ఇంకా లోతుగా తరచి చూస్తే, ఆశను త్యజించాలని   అనుకుంటే అది కూడా ఆశేకదా?

          మీ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు."నువ్వు సంపద మీద ఆశ పెంచుకున్నావు. అదే నీ దుఃఖానికి కారణం. భగవంతుడి మీద ఆశ పెంచుకో" అంటాడు.

          నీ దగ్గర పదికోట్ల రూపాయలున్నయనుకుందాం. భగవంతుణి నమ్మి మీ డబ్బంతా పేదలకు పంచి ఇచ్చేస్తే నిఛిత దొరుకుతుందా? రేపట్నుంచి ఈ దేశంలోని పేదవాళ్ళలో మీరు కూడా కలుస్తారు అంతే!

         డబ్బు ఉంటే ఏమేం చేయవచ్చు అన్నదైనా మీకు తెల్సు. భగవంతుడి వల్ల ఏమవుతింది? ఏం కాదు అనే విషయంలో మీకు అనుభవం లేదు.

        "సంతోషం కోసం ఆశ పడకు. స్వర్గం కోసం ఆశ పడు. అధికారం కావాలని ఆశ పడకు. ప్రశాంతత కావాలని ఆశపడు" అంటూ అవేవో సందేశాలు వస్తూనే ఉంటాయి.

        శంకరన్ పిళ్ళైకి ఒకసారి తాళలేని నడుంనొప్పి వచ్చింది. డాక్టర్ ఎక్ష్సరేని వెలుతుర్లో పరీక్షించాడు.

"ఈ ఎక్ష్సరే చూశారా? మీ వెన్నుముక బాగా దెబ్బతింది. ఆపరేషాన్ చేయాలి" అన్నాడు డాక్టర్.
     
      "ఎంత ఖర్చవుతుంది డాక్టర్?"

      " నా ఫీజు రూ.25,000. ఆస్పత్రిలో ఆరువారాలైనా వండి రెస్ట్ తీసుకోవాలి" అని చెప్పాడు డాక్టర్.

పిళ్ళైకి ఏం చేయాలో తోచలేదు. అంత డబ్బు ఎలా వస్తుంది."ఇప్పుడే వస్తాను డాక్టర్" అంటూ ఎక్ష్సరే తీసిన వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. అతనికి రూ.25 ఇచ్చి "ఓ గంటలో నా వ్యాధి తగ్గిపోయేలా ఈఎక్ష్సరేని మార్చగలవేమో చూడు"
   
           అలాంటి ఎక్ష్సరేల్ని మార్చగలిగే సన్న్యాసులు లేక స్వాములే ఆశల్ని ఒకదాన్నుంచి మరొకదానికి మార్చుకోమని చెబుతారు. అయన కాకపోతే మరొక స్వామి రావచ్చు. అయన "సరే... ఆశను పూర్తిగా త్యజించనక్కరలేదు.కొద్దికొద్దిగా ఎదోకాస్త తక్కువ ప్రయాణంలో అయితే పర్వాలేదు" అంటూ అనుమతిస్తాడు.

           "కావాలనుకుంటే... నేనింకా వజ్రాలు సంపాదించగలను,కానీ,నాకు ఇదే చాలు" అని ఒక వజ్రంతో తృప్తిపడితే మెచ్చుకోవచ్చు. అది సంతృప్తినీ, అనందాన్నీ ఇవ్వవచ్చు. అయితే, "నాకవన్నీ ఎక్కడ అందుతాయి?ఇదే చాలు" అంటూ తాత్వికంగా మాట్లడి, నీ ఆశలరెక్కల్ని కత్తిరించుకుంటే, అది పిరికితనం.

"పక్కింటివాడు పేరాశగాడు. అయినా వాడికన్నీ లభిస్తున్నాయి. నేను ఆశపడుతున్నదే ఏదో కొంచెం. అదీ నాకు దక్కడం లేదు!" అనే బాధే మిగులుతుంది.

          అందుకే చెప్తున్నాను. మీరు ఆశలు పెంచుకోండి. చాలా ఎక్కువ ఆశలు పెంచుకోండి. ఆ ధైర్యం కూడా లేకుండా, అల్పత్వం పెంచుకొని ఆశల్ని చంపుకుంటే, జీవితంలో మీరే దేన్ని సాధించలేరు.

           మీ జీవనస్థాయిని నిర్ణయం ఆశల్ని గురించి మరింత వివరంగా వచ్చేవారం తెలుసుకుందాం.


                                                                         మౌనంతో రహస్యం
                                                                        సద్గురు జగ్గీ వాసుదేవ్


  


No comments:

Post a Comment